కరోనా నియంత్ర‌ణ‌కు నిత్య వైద్య పరీక్షలే మేలు: సోనియా

క‌రోనా నేప‌థ్యంలో కాంగ్రెస్ అధినేత్రి కొత్త ప్ర‌తిపాద‌న‌లు చేశారు. కరోనాపై పోరులో నిత్యం వైద్య పరీక్షలు చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని  అభిప్రాయపడ్డారు. వైద్యులు, మెడికల్ సిబ్బందికి రక్షణ ఎంతో అవ‌స‌ర‌మ‌న్న సోనియా..వారికి పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, ఎన్-95 మాస్కులు అందజేయాల్సి వుందని తెలిపారు. ఈ మేరకు చర్యలు వెంటనే తీసుకోవాలని ప్రధాన మంత్రి మోదీని డిమాండ్ చేశారు. అటు 21 రోజుల లాక్ డౌన్ అత్యంత అనివార్యమేనని, కానీ కేంద్ర ప్రభుత్వానికి తగిన ప్రణాళిక లేకపోవడంతో వలస కుటుంబాలు, కూలీలు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని వివ‌రించారు. ఇక కరోనా నియంత్రణ‌కు చేపట్టిన చర్యలు, ఐసొలేషన్ వార్డుల వివరాలు, క్వారెంటైన్ ఏర్పాట్లు వంటి అంశాలను కామన్ పీపుల్‌కు అందుబాటులో వుంచాలన్నారు. చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ భేటీ వీడియో  కాన్ఫ‌రెన్స్‌లో నిర్వ‌హించారు. మానవాళి సంక్షోభంలో వున్న సమయంలో ఇలా కలుస్తున్నందుకు బాధగా వుందంటూ ఆమె వ్యాఖ్యానించారు. అటు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాలు చాలా పెద్దదని, అయినా దాన్ని అధిగమిస్తామన్న నమ్మకం ఉందని సోనియా తెలిపారు.