ఆరు దారులు.. రూ.60వేల కోట్లు!
- పోలవరం-బానకచర్ల ఎత్తిపోతలకు వాప్కోస్ ఫీజబులిటీ నివేదిక సిద్ధం
- సీఎం జగన్ ఆదేశాల మేరకు తుది నిర్ణయం
అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): పోలవరం-బానకచర్ల ఎత్తిపోతల పథకానికి ఫీజబులిటీ (సాధ్యాసాధ్యాలు) నివేదిక సిద్ధమైంది. ఈ పథకాన్ని చేపట్టేందుకు రూ.60వేల కోట్ల వ్యయం అవుతుందని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వాప్కోస్ ప్రాథమికంగా అంచనా వేసింది. ఏ విధంగా అమలు చేయాలో ఆరు మార్గాల(ఆప్షన్లు)ను సూచించింది. పోలవరం సాగునీటి ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ నుంచి శ్రీశైలం జలాశయంలోకి గోదావరి జలాలను ఎత్తిపోసి, బానకచర్ల కాంప్లెక్స్‌కు తీసుకెళ్లడం ద్వారా రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్నదే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఇందులోభాగంగా గుంటూరు జిల్లా బొల్లాపల్లి వద్ద 150 టీఎంసీల సామర్థ్యం కలిగిన భారీ రిజర్వాయర్‌ను నిర్మిస్తారు.
దీనివల్ల 9.61 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చని జల వనరులశాఖ చెబుతోంది. ముఖ్యమంత్రి జగన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ పథకానికి వాప్కోస్ ఇచ్చిన ఫీజబులిటీ నివేదికపై ఆయన వద్ద ఒకటి రెండు రోజుల్లో సమీక్ష జరగనున్నది. నివేదికలో ఇచ్చిన ఆరు ఆప్షన్లలో జగన్ సూచించిన దానిని తీసుకుని తదుపరి చర్యలు తీసుకోవాలని జల వనరుల శాఖ భావిస్తోంది. ఇది భారీ వ్యయంతో కూడిన నిర్మాణం అయినందున ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసేందుకు కూడా రాష్ట్ర జల వనరులశాఖ సిద్ధమవుతోంది.